కామ్రేడ్ డీవీకేకు ఘన నివాళి.

కామ్రేడ్ డీవీకేకు ఘన నివాళి.

4వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ నేతల శ్రద్ధాంజలి.

బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ డీవీకే 4వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

 

 

 

డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీవీకే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, కామ్రేడ్ డీవీకే భారత విప్లవోద్యమంలో ప్రముఖ నాయకుడు, కమ్యూనిస్టు సిద్ధాంతకర్తగా విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఆయన అతివాదానికి, మితవాదానికి వ్యతిరేకంగా ప్రజాపంథా మార్గాన్ని బోధించి, తన ఆచరణతో ఆదర్శంగా నిలిచారని అన్నారు.

జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించి విజయాలు సాధించడంలో డీవీకే కీలక పాత్ర పోషించారని తెలిపారు. పర్యావరణ మార్పులు, వాటి వల్ల సంభవించే విపత్తులపై ముందుగానే హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారని గుర్తుచేశారు. డీవీకే ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని బి. మల్లేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, ఎండి ఇర్షద్, బి. సాయిలు, డి. పోశెట్టి, జి. దేవయ్య, జి. లాలయ్య, గంగారాం, సాయిబాబా, జి. శ్రీను, లక్ష్మణ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.