బోధన్‌లో “మే ఫ్లవర్” పూల సందడి.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలో మే నెల రాగానే వికసించే “మే ఫ్లవర్” పూలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలోని ఆజం గంజ్ ప్రాంతానికి చెందిన పి. నాగభూషణం, కోటయ్య క్యాంపు ప్రాంతానికి చెందిన నామాల వాసు నివాసాల్లో ఉన్న మే ఫ్లవర్ చెట్లు ఎర్రటి అందమైన పూలతో కళకళలాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వేసవి తీవ్రత మధ్య ప్రకృతి అందాలను చాటుతూ వికసించిన ఈ పూలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే ప్రత్యేకంగా పూసే ఈ పూలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

ఈ సందర్భంగా పి. నాగభూషణం మాట్లాడుతూ, “మే ఫ్లవర్ చెట్టు ప్రతి సంవత్సరం మే నెలలో పూసి ఇంటి పరిసరాలను అందంగా మార్చుతుంది. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో అవసరం” అని తెలిపారు.
స్థానికులు కూడా ప్రతి ఇంట్లో ఇలాంటి పూల మొక్కలను పెంచాలని, పచ్చదనాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బోధన్ పట్టణంలో వికసించిన మే ఫ్లవర్ పూలు ప్రత్యేక ఆకర్షణగా మారి స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.
