ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. వార్డు సభలో సమస్యల పరిష్కారం.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ : ప్రజా ప్రణాళికలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వార్డు సభ నిర్వహించనున్నట్లు 3వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ హకీమ్ తెలిపారు.
ఈ సందర్భంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
వార్డు సభలో కొత్త పెన్షన్ల మంజూరు, నిలిచిపోయిన పెన్షన్లు, సాంకేతిక సమస్యలు, కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు లేదా తొలగింపు, రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించిన సమస్యలు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో పేరు లేకపోవడం, ఇళ్ల మంజూరులో జాప్యం, పెండింగ్ బిల్లుల సమస్యలను పరిశీలించనున్నట్లు తెలిపారు.
3వ వార్డుకు చెందిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన పాత దరఖాస్తులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ అబ్దుల్ హకీమ్ విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
