ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా.. డ్రైవర్ మృతి.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంబార్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన మంగలి రాజు (36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగలి కాంతారావు కుమారుడైన రాజు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం తన ట్రాక్టర్‌ను నడుపుకుంటూ బాన్సువాడ నుంచి కిస్టాపూర్ వైపు వెళ్తుండగా, పాత బాన్సువాడ రహదారి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుకు ఎడమవైపు ఉన్న గుంతల్లోకి వెళ్లింది. ఈ ఘటనలో రాజు ట్రాక్టర్‌పై నుంచి ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చెవుల నుంచి రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బాన్సువాడ స్టేషన్ హౌస్ అధికారి వెల్లడించారు.
