“భావితరాల భవిష్యత్తుకు విద్యే పెట్టుబడి: యంగ్ ఇండియా స్కూల్ పనులపై సమీక్ష”.

“భావితరాల భవిష్యత్తుకు విద్యే పెట్టుబడి: యంగ్ ఇండియా స్కూల్ పనులపై సమీక్ష”.

ఖమ్మం ప్రతినిధి దేవల్ల ఉపేంద్ర :- మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మాణ పనులను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జూనియర్, సీనియర్ విద్యార్థుల హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ల్యాబొరేటరీ భవనాల నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారులకు, గుత్తేదారులకు పలు కీలక సూచనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం భవనాలు మాత్రమే కాదని, రేపటి తరాలను తీర్చిదిద్దే విద్యా ఆలయాలని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయి భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని అన్నారు.

విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పాఠశాల నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

 

 

 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతో పాటు, ఆధునిక విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయని అభిప్రాయపడ్డారు.