జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం.
రూ.106 కోట్లతో నిర్మాణం పూర్తి – రూ.120 కోట్ల రిజర్వాయర్ పనులపై సమీక్ష.
పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు పాల్గొనడం.
వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోర గ్రామంలో రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం సుమారు రూ.120 కోట్లతో నిర్మాణ దశలో ఉన్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఇరిగేషన్ & CAD శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఎత్తిపోతల పథకాల చైర్మన్ పెంటారెడ్డి, ఈఎంసీ శ్రీనివాస్, ఇరిగేషన్ జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి జిల్లా ఎస్పీ మరియు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జాయింట్ కలెక్టర్ భుజంగరావు, ఇరిగేషన్ శాఖ సీఈలు ప్రమీల, శ్రీదేవి, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాంతంలోని వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, జిల్లా స్థాయి అధికారులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పథకాల ప్రారంభంతో వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
