బాన్సువాడ తడ్కోల్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం – రైతు దుర్మరణం

 

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ కుల్కర్ ని :- బాన్సువాడ పట్టణంలోని తడ్కోల్ చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

 

 

పోలీసుల వివరాల ప్రకారం, బిచ్కుంద మండలం గుప్పన్ పల్లి గ్రామానికి చెందిన కుర్మ హన్మంత్లు (55) తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా తడ్కోల్ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 

 

మృతుడు వృత్తిరీత్యా రైతు. ఆయన తండ్రి పేరు లస్మ గౌడ్. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

 

 

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడ్కోల్ చౌరస్తా వద్ద వాహనాల వేగం నియంత్రణలో లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

 

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గుప్పన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.