ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ పొందిన 355 మంది క్యాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానం.

 

ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ పొందిన 355 మంది క్యాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానం.

వరంగల్ ప్రతినిధి : స్థానిక లాల్ బహదూర్ కళాశాల ఆడిటోరియంలో 10 తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన క్యాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.ఎస్. రామదురై పర్యవేక్షణలో జరిగింది.

 

 

 

ముఖ్య అతిథిగా హాజరైన 10 తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే మాట్లాడుతూ, ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ యువతకు భారత సైన్యంలో ప్రవేశించేందుకు ఒక మంచి అవకాశమని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి వంటి విలువలను పెంపొందించడమే ఎన్‌సీసీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

 

 

 

‘బి’ సర్టిఫికెట్ అనంతరం ‘సి’ సర్టిఫికెట్ కూడా పూర్తి చేసి భారత సైన్యం, కేంద్ర పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలు మరియు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని క్యాడెట్లకు సూచించారు.

 

 

 

కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ముండ్రాతి సదానందం, నాయబ్ సుబేదార్ అనిల్ జాదవ్, బెటాలియన్ హవల్దార్ మేజర్ సందీప్, లెఫ్టినెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రైనింగ్ ఇన్‌చార్జ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

లాల్ బహదూర్ కళాశాల, సీకేఎం కళాశాల, కేడీసీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జనగాం), నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సైనిక్ డిగ్రీ కళాశాల, వాగ్దేవి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ వ్యవసాయ డిగ్రీ కళాశాల, ధర్మసాగర్ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు సర్టిఫికెట్లను అందుకున్నారు.

 

 

మొత్తం 355 మంది క్యాడెట్లు ‘బి’ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి.హెచ్. రావు తెలిపారు.