కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలి: ఎంసీపీఐ(యూ).
బోధన్ ప్రతినిధి రాహుల్ :- కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ(యూ) బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) బోధన్ పట్టణ కార్యదర్శి ఎం.డి. మొసిన్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారాలను మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచిందని అన్నారు.
పార్టీ నాయకురాలు తోట సంగీత మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం, ఆకలి సమస్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులై ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) నాయకులు సి. లక్ష్మణ్, మారుతి, స్వామి, రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
