పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ.

పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ.

హైదరాబాద్‌ ప్రతినిధి :-  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ–ఖాజాగూడ ప్రాంతంలో ఉన్న సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు శుక్రవారం పరిరక్షించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ చర్యలో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేశారు.

 

 

 

ఈ భూమిలో సుమారు 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన రాతి నిర్మాణాలు, రాతిగుట్టలు, సహజ శిలా సంపద ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని చారిత్రక రాతిగుట్టల పరిరక్షణ కోసం “సొసైటీ టు సేవ్ రాక్స్” ప్రతినిధులు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు.

 

 

2019లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల సరిహద్దులను గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సూచనలు జారీ అయ్యాయి. ఇటీవల “సొసైటీ టు సేవ్ రాక్స్” ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు.

 

 

రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, సర్వే నంబర్ 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాల్లో గ్రామాల మధ్య సరిహద్దు వివాదాలు, ప్రైవేటు హక్కుల అంశాలను పరిశీలించిన అనంతరం సుమారు 200 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ భూమిని గతంలో HMDAకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో శుక్రవారం హైడ్రా అధికారులు 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

 

ఈ చర్యతో చారిత్రక రాతిగుట్టలు, సహజ శిలా సంపద, పర్యావరణ వారసత్వం పరిరక్షించబడిందని “సొసైటీ టు సేవ్ రాక్స్” ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాతిగుట్టల పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు.

 

 

హైడ్రా చేపట్టిన ఈ చర్య ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు చారిత్రక, పర్యావరణ సంపదను భావితరాలకు అందించడంలో కీలకంగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు.