500 మంది పోలీసులతో మెగా తనిఖీలు.. 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు.

500 మంది పోలీసులతో మెగా తనిఖీలు.. 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు.

హైదరాబాద్ ప్రతినిధి: నగరంలోని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో శుక్రవారం పోలీసులు భారీ స్థాయిలో స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లలో ఏకకాలంలో దాడులు చేపట్టారు.

 

 

తనిఖీల సందర్భంగా పలు స్పా సెంటర్లలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా కస్టమర్ల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించడం లేదని, అవసరమైన రికార్డులు లేకుండానే కొన్ని కేంద్రాలు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

 

 

అలాగే స్పా సెంటర్లకు భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులను కూడా పోలీసులు విచారించారు. అద్దె వసూలు చేయడం మినహా కేంద్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై కొందరు యజమానులు పర్యవేక్షణ చేయడం లేదని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

 

 

నగరంలోని కొన్ని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ గత కొంతకాలంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలలో గుర్తించిన ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున స్పా సెంటర్లపై తనిఖీలు నిర్వహించడం నగరంలో ఇదే తొలిసారి కావడంతో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. స్పా సెంటర్ల నిర్వహణలో కఠిన నిబంధనలు అమలు చేసి, స్పా ముసుగులో జరిగే అక్రమ, అసాంఘిక కార్యకలాపాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.