బాన్సువాడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో భారీ కార్డెన్ సెర్చ్.. 150 బైక్‌లు, 30 ఆటోలు స్వాధీనం.

 

బాన్సువాడ ప్రతినిధి విశ్వంబార్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారు ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సీఐలు, ఎస్సైలు సహా సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

కాలనీలోని సుమారు 1000 ఇళ్లలో ప్రతి ఇంటిని పరిశీలించిన పోలీసులు, లబ్ధిదారుల ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. అలాగే కాలనీలో ఉన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలను పరిశీలించి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌సీ బుక్‌లు లేకపోవడం, బినామీ పేర్లపై వాహనాలు ఉండటం వంటి కారణాలతో 150 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను సీజ్ చేశారు. సరైన పత్రాలు సమర్పించిన అనంతరం వాటిని యజమానులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

తనిఖీల సందర్భంగా మద్యం సేవించి ఇబ్బందులు సృష్టిస్తున్న వారిపై, మహిళలను వేధించే వ్యక్తులపై, గంజాయి వినియోగం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం సేకరించారు. గ్యాస్ కనెక్షన్ పత్రాలు లేకుండా సిలిండర్లు వినియోగిస్తున్న వారి వద్ద నుంచి సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

 

 

ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన పోలీసులు వారి సమస్యలను తెలుసుకొని, నేరస్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్నారా అనే అంశంపై ఆరా తీశారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించడంపై స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ కార్డెన్ సెర్చ్ లక్ష్యమని తెలిపారు. దొంగ వాహనాల వినియోగం, గంజాయి మరియు మద్యం సేవనం వంటి కార్యకలాపాలపై సమాచారం రావడంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.