హన్మాజీపేట్లో అఖండ హరినామ సప్తహం వైభవంగా ప్రారంభం.
బాన్సువాడ మండలం, హన్మాజీపేట్ :- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద అఖండ హరినామ సప్తహ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి గ్రామస్తులు మరియు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆరో రోజు సందర్భంగా వడగావ్కు చెందిన చైతన్య మహారాజ్ కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆయన తుకారం మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ రచించిన అభంగాలపై ప్రవచనం చేసి, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నామస్మరణే మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ భగవంతునికి చేరువయ్యే మార్గాన్ని ఎంచుకొని నామస్మరణ చేయాలని, అలాంటి వారు నిజమైన భాగ్యవంతులని ఆయన పేర్కొన్నారు. భజన మండలి సభ్యులు తాళాలు, మృదంగ వాద్యాలతో నిర్వహించిన భజన కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అలాగే కోనాపూర్, సంగోజీపేట్, ఖాదలపూర్, సర్వాపూర్, ముదెల్లి తదితర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
